Tuesday, August 25, 2009

కాశీమజిలీలో గురుమామయ్య కథాకమామీషు

సాధారణంగా ఎవరు బ్లాగ్ రాసినా.. దాని వెనుక తమ అభిప్రాయాలు, ఆలోచనలు నలుగురితో పంచుకోవాలనే ఉద్దేశ్యమే ఎక్కువగా ఉంటుంది. ఎవరు విషయం గురించి రాస్తున్నారనేది వారి వారి అభిరుచిని బట్టి మారవచ్చు. ఏదైనా ఒక విషయం పట్ల విస్త్రృతమైన అవగాహన, పరిజ్ఞానం ఉండి, దాన్నిసులభతరమైన రీతిలో మరో నలుగురికి చేరువగా చేసేందుకు బ్లాగును వేదికగా చేసుకోవడమనేది చాలా అరుదుగా జరిగే విషయం.

ఇప్పుడు మేము చెప్పబోయేది పైన చెప్పిన లక్షణాలన్నీటినీ పుణికి పుచ్చుకున్న ఒకానొక తెలుగు బ్లాగు గురించే.. అదే శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారు రాస్తున్న 'హాస్య దర్బార్' బ్లాగ్!.ఎంతో క్లిష్టతరమైన మేనేజ్మెంట్ విషయాలను సరళమైన భాషలో విపులంగా వివరించటంలో, అవి కథల రూపంలో ఆసక్తికరంగా మలచటంలో రచయిత నేర్పు, సామర్ధ్యం మనల్ని అబ్బురపరుస్తుంది.

అంతేకాదు, ఇలాంటివి రాయడానికి పూనుకోవడం ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే కూడా.! ఎందుకంటే, బిజినెస్ పాఠాలైనా, మేనేజ్మెంట్ పాఠాలైనా టెక్స్ట్ పుస్తకాల్లో మాదిరి రాసేట్టయితే అందులో ప్రత్యేకతేముంటుంది.? చదువరులకు ఉల్లాసంగా కులాసా కబుర్లు చెప్పినంత సరదాగా మన తియ్యటి తెలుగులో మేనేజ్మెంట్ సూత్రాలు చెప్పడమే బ్లాగులో ఉన్న గొప్పదనం.

'కార్పొరేట్ కాశీ మజిలీ కథలు' అని సత్యప్రసాద్ గారు ఎంచుకున్న పేరు ఆయన కథలకి అతికినట్టుగా సరిపోతాయి. కాశీ మజిలీ కథలు చదువుతున్నంత హాయిగానూ అనిపిస్తుంది. గురు మామయ్య చెప్పే కార్పొరేట్ కాశీమజిలీ కథలు అల్లుడు వెంకటరత్నానికే కాదు.. చదివే ప్రతి ఒక్కరికి ఉపయోగమే. ఇందులోని ప్రతి రచన చక్కని తెలుగులో సులభ తరమైన శైలి లో సాగుతూ ఆపకుండా చదివిస్తాయి.

బ్లాగుని గురించి తెలియనివారికి ఇందులో ఏమున్నాయో చెప్పే ఒక చిన్న ప్రయత్నంగా..

ఉద్యోగం కావాలన్నా ఇంటర్వ్యూలకి హాజరవడం మొదటి ,కీలకమైన మెట్టు. దానికి సంబంధించి గురుమామయ్య చెప్పిన కిటుకులు ఇక్కడ చూడొచ్చు.

మధ్య కాలంలో మన ఆంధ్రదేశంలోనే కాక సాఫ్ట్వేర్ ప్రపంచంలో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిన సత్యం ఉదంతం గురించి గురుమామయ్య మాటల్లో ఇక్కడ చూడచ్చు.

ప్రపంచంలో ఎటు వైపు చూసినా కనిపిస్తున్న రెసెషన్ జపం, అగ్రరాజ్యం అమెరికా దివాళాకోరుతనం గురించి ఇక్కడ చూడచ్చు.

స్టాక్ మార్కెట్లు, షేర్లు అని వినడమే గానీ, వాటి గురించి పెద్దగా ఏమీ తెలీదనుకుంటే.. గురుమామయ్య చెప్పిన క్లాసుకు అటెండ్ అవ్వాల్సిందే మరి.!

ఇలాంటివే మరెన్నో వాణిజ్యపరమైన అంశాలైన ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వివిధ విషయాల గురించి విపులంగా చర్చించారు సత్యప్రసాద్ గారు 'హాస్యదర్బార్' బ్లాగులో.

అదీ, ఇది అని కాకుండా హాస్యదర్బార్లో వచ్చే ప్రతీ టపా ఉపయోగకరమైనదే కాబట్టి, అన్నిటినీ ముచ్చటగా ఒకే చోట భద్రపరచుకుని చదువుకోవాలనుకుంటే, తెలుగురత్న వారి సహకారంతో హాస్యదర్బార్ -బుక్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇందులో బ్లాగులోని కొన్ని వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. మిగతావాటిని కూడా -బుక్ రూపంలో అందించే దిశగా సత్యప్రసాద్ గారు ప్రయత్నిస్తున్నారు.

తెలుగులో మేము చూసినంతవరకూ.. ఇది ఒక అత్యుత్తమైన బ్లాగని మా అభిప్రాయం.

ఏతా వాతా మేం చెప్పొచ్చేదేమిటంటే అధ్యక్షా..! హాస్యదర్బార్ అని చెప్పబడేటువంటి ముచ్చటైన తెలుగు బ్లాగు మన బ్లాగ్జనులకు అత్యంత ఉపయోగకరంగా ఉందని, తెలియనివారు కూడా చక్కటి బ్లాగు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మేము తెలియజేస్తున్నమహో..! తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇంత చక్కటి బ్లాగుని వ్రాస్తున్నందులకు గానూ.. శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారికి అనేకానేక ధన్యవాదములు, అభినందనలు తెలుపుకుంటూ.. ఒక చిన్న కానుకగా లోగో ని అందజేస్తున్నాము..!



P.S: బ్లాగు గురించి మేమిక్కడ చెప్పిన అభిప్రాయాలు మరే బ్లాగుతోనూ పోల్చి గానీ, లెక్కగట్టి గానీ చెప్పలేదనీ, కేవలం బ్లాగుని గురించిన మా అభిప్రాయాలను నిర్దిష్టంగా తెలియపరిచామని మనవి.

మళ్లీ మరో చక్కటి బ్లాగుతోనో, పోస్టుతోనో.. మరోసారి మీ ముందుకి వస్తాం.. అందాకా సెలవ్.!

-- సుజ్జీ & మధుర

Monday, July 27, 2009

అందరికీ నచ్చేలా.. కొంచెం కొత్తగా..!

ప్రశ్న: ఏంటీ సుజనమధురం.?
సమాధానం: బ్లాగు క్యాప్షన్ చూడొచ్చుగా ;)

ప్రశ్న: ఎందుకు?
సమాధానం: ఇదో ఆలోచన కలబోత.!

ప్రశ్న: ఎవరి ఆలోచనలు?
సమాధానం: మావే.. (సుజ్జీ, మధుర)

ప్రశ్న: పరీక్ష (మీక్కాదు) అన్నారు. మరి ఎవరికి?
సమాధానం: అవును.. పరీక్ష మీక్కాదు. మాకే.! ఇన్నాళ్ళు హాయిగా నాలుగు కవితలు రాసుకుంటూ (సుజ్జీ), ఏవో పాటలు పాడుకుంటూ (మధుర) మా మానాన మేం ఉండేవాళ్ళం. మరిప్పుడేమో ఏదో పొడిచేద్దాం అని ఇద్దరం కలిసి ఒక బ్లాగ్ మొదలెట్టాం కదా.! ఇప్పుడు దాన్ని విజయవంతంగా, బ్లాగు జనులకు నచ్చేలా, అటు పనికొచ్చే సమాచారాన్ని అందిస్తూ, ఇటు కాలక్షేపానికన్నట్టూ, అన్నివిధాలా మెప్పించేట్టు రాయడం అంత సులువైన పని కాదుగా.! అందుకే.. పరీక్ష మీక్కాదు..మాకే ;)

ప్రశ్న: సరే.. అయితే ఏం చేయబోతున్నారు.?
సమాధానం: మేము ఇక్కడ చెప్పబోయే కబుర్లన్నీ మన బ్లాగ్లోకం చుట్టూనే తిరుగుతాయి. మన తెలుగు బ్లాగుల గురించి అందరికీ తెలిసిన మరియు తెలియని వివిధ కోణాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే, ఒక విషయం స్పష్టం చేస్తున్నాం. మేము ఇక్కడ ప్రకటించే అభిప్రాయాలు, ఆలోచనలు మాకు మాత్రమే పరిమితమైనవి. ఎప్పుడు బ్లాగు గురించి ఏం చెప్తామన్నదానికి ప్రత్యేక నిబంధనలంటూ ఏమీ లేవు. మా స్వేఛ్చానుసారం ప్రవర్తిస్తాము. అలాగే ఇక్కడ మేము చేయాలనుకునేది స్నేహపూర్వకమైన భావవ్యక్తీకరణ మాత్రమే.!

ప్రశ్న: అంటే ఏం చేస్తారు?
సమాధానం: అది తెలుసుకోవాలంటే.. వేచి చూడండి. వచ్చే టపా నుంచే మొదలు ;)

Saturday, July 11, 2009