Thursday, December 30, 2010

నూతన సంవత్సరాగమనం - e-పుస్తకం - తెలుగు బ్లాగర్ల రచనా సంకలనం


యాధృచ్చికంగా
ఒకనాడు మేమిద్దరం కలిసి బ్లాగ్ మొదలెట్టాలి అనుకున్నాక, పేరు దగ్గరి నుండి టెంప్లేట్ దాకా.. ఏం రాయాలి దగ్గరినుండి ఎలా రాయాలి దాకా.. చర్చించుకోవటం చాలా ఉత్సాహంగా ఉండేది. టెక్నికల్ విషయాలనుండి ఇమేజ్ సెలక్షన్, క్రియేషన్... ఇలా పనులన్నీటినీ మా సమయానుకూలతని బట్టి ఇద్దరమూ సమన్వయించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మేం రాసే ప్రతీ పోస్ట్ కూడా బ్లాగుల్లో రచనలకి సంబంధించినది అయ్యుండాలనే మా మొదటి సూత్రాన్ని ఎప్పటికప్పుడు గుర్తెరిగి దానికి అనుగుణంగానే బ్లాగులో పోస్టులు ఉండేలా చూసుకుంటున్నాం.

ఒకానొక రోజు మాటల సందర్భంలో అనుకోకుండా -బుక్ ప్రస్తావన మా మధ్య రావటం, అమలు పరచటం వెనువెంటనే జరిగిపోయాయి. మొత్తం పుస్తకం రూపకల్పనలో ఎక్కువ కష్టపడింది మాత్రం మధుర అనే చెప్పాలి. అందరి పోస్టులూ డాక్యుమెంట్ చేయడం, ఫార్మాటింగులూ గట్రా చూస్కోవడం.. అవన్నీ తనే చేసింది. నేను కాస్త బిజీగా ఉండటం వల్ల మరింత సమయం పుస్తకం కోసం కేటాయించలేకపోయినప్పటికీ పాపం విసుక్కోకుండా ఓపిగ్గా తనే అన్నీ నెట్టుకొచ్చింది.

పుస్తకం కోసం పోస్ట్ లను ఎన్నుకోడం, రాసిన వారి నుండి అనుమతులు తీసుకోడం, వాటన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా కూర్చటం... మాటల్లో చెప్పడానికి మూడు ముక్కలుగా అయిపోయినా... ఇదంతా చేతల్లో చూపడానికి ఎంత శ్రమ, ఎంత సమయం, ఎంత ఓర్పు అవసరమో మాకు స్వీయానుభవంలోకి వచ్చింది. పుస్తకం కూర్చే క్రమంలో మాకు సహకరించిన, మమ్మల్ని ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.

ప్రకటించిన తేదికి ఎటువంటి వాయిదాలు వెయ్యకుండా విజయవంతంగా పుస్తకాన్ని విడుదల చెయ్యాలని మా ఇద్దరి కోరిక. ఎట్టకేలకు మేము అనుకున్న విధంగా నూతన సంవత్సరం ఏతెంచే సమయానికి 'నూతన సంవత్సరాగమనం' అనే మన తెలుగు బ్లాగర్ల రచనా సంకలనాన్ని e-పుస్తకం రూపంలో మీ అందరి ముందుకి తీసుకొచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మీరందరూ వీలు చేసుకుని పుస్తకాన్ని చూసి, చదివి మీ అభిప్రాయాలు తెలియజేస్తే మరింత సంతోషంగా ఉంటుంది. విలువైన మీ స్పందన కోసం ఎదురు చూస్తాం.

- సుజ్జీ

e-పుస్తకాన్ని ఎవరైనా ఉచితంగా ఇక్కడ నుండి లేదా ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..